SDN Buzz - Global Telugu News, World Updates, Political Buzz | SDN News
Submit Article

తీవ్ర ఆరోపణలతో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

Telangana

Published on 15 Oct 2025

తీవ్ర ఆరోపణలతో  మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం పీసీబీ కార్యదర్శి రవి గగులోతు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పీసీబీలో ఓఎస్‌డ్డీ నియమితులైన సుమంత్.. డిప్యుటేషన్‌పై మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2024 ఫిబ్రవరిలో సుమంత్‌ను పీసీబీలో నియమించి.. వెంటనే మంత్రి పేషీకి పంపించారు. అప్పటి నుంచి ఆయన మంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సుమంత్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ప్రభుత్వ విషయంలోనూ జోక్యం చేసుకోవడం, అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, కాలుష్యకారక పరిశ్రమలకు సంబంధించిన కీలక నిర్ణయాలలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. సుమంత్ కార్యకలాపాలపై కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఇటీవల సుమంత్‌పై ఆరోపణలు మరింత తీవ్రస్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సంబంధిత అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా, నిఘా విభాగం కూడా సుమంత్ కార్యకలాపాలపై సవివరమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.

మంత్రి పేషీలో జరిగిన ఒక ముఖ్య సంఘటన కూడా సుమంత్ తొలగింపునకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మేడారం జాతర పనులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదుకు సంబంధించిన నోట్‌ను మంత్రి పీఆర్వోనే మీడియాకు పంపారు. ఈ వివాదంలో ఓఎస్డీ సుమంత్ నేరుగా ఇంజినీర్లతో మాట్లాడి ఒత్తిడి చేసిన అంశం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. మంత్రి పేషీలలో జరుగుతున్న అనవసర జోక్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. సుమంత్‌ను తొలగించడం ద్వారా ఇతర మంత్రుల కార్యాలయాలు, సచివాలయంలో ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్న వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించినట్లుగా సమాచారం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ తొలగింపు ద్వారా ప్రభుత్వం సంకేతం పంపింది.