SDN Buzz - Global Telugu News, World Updates, Political Buzz | SDN News
Submit Article

నగరంలోని బడా మాల్స్‌కు GHMC నోటీసులు.. స్పందించకుంటే సీజ్!

Today News

Published on 14 Oct 2025

నగరంలోని బడా మాల్స్‌కు GHMC నోటీసులు.. స్పందించకుంటే సీజ్!

హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో మాల్స్ ఉన్నాయి. సినిమా, షాపింగ్, పిల్లలకు ఔటింగ్.. ఇలా అన్ని సౌకర్యాలు ఒక్క చోటే ఉండటంతో.. చాలా మంది నగరవాసులు.. చిల్ అవ్వడం కోసమో.. కుటుంబంతో గడపడం కోసమే మాల్స్‌కు వెళ్తుంటారు. నగరంలో దాదాపు 300 వరకు మాల్స్ ఉన్నాయి. అయితే మాల్స్‌లో ఏది కొందామన్నా.. ధరలు భారీగానే ఉంటాయి. అధిక ధరలతో వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టే మాల్స్.. ఆస్తి పన్ను చెల్లింపు, ట్రేడ్ లైసెన్స్ వంటి అంశాల్లో నిబంధనలు సరిగా పాటించడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని మాల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించారు.
ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సుల విషయంలో కొన్ని మాల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని అధికారులు గుర్తించారు. కొన్ని మాల్స్.. ఉన్న దాని కన్నా.. తక్కువ విస్తీర్ణం చూపించి ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నాయని.. అలానే మాల్స్‌లోని వ్యాపారులు లైసెన్స్ ఫీజులు చెల్లించడం లేదనే అంశాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈక్రమంలో అక్టోబర్ 8 నుంచి 13 అనగా సోమవారం వరకు దాదాపు 200 మాల్స్‌కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సదరు మాల్స్ నిబంధలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నోటీసులు అందుకున్న వాటిల్లో హైదరాబాద్ సెంట్రల్, జీవీకే, సీఎంఆర్, ఐకియా, ఫోరం మాల్ వంటి బడా మాల్స్ కూడా ఉన్నాయి. మిగిలిన మాల్స్‌కు మంగళవారం నోటీసులు జారీ చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మాల్స్‌కు మాత్రం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత.. అనగా నవంబర్ 14న నోటీసులు జారీ చేయనున్నారు.
ముందుగానోటీసులు అందుకున్న మాల్స్ యజమానుల నుంచి వివరణ కోరతారు. అనంతరం నివాస ప్రాంతాల్లో ఉన్న మాల్స్‌ని వాణిజ్యపరమైనవిగా మార్చి.. అందుకు తగ్గట్టుగా వాటి నుంచి ఆస్తి పన్ను వసూలు చేస్తారు. మాల్స్‌లో ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారో గుర్తించి.. వారందరి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజును కచ్చితంగా వసూలు చేస్తారు. నోటీసులు అందుకున్న మాల్స్ సరిగా స్పందిచకపోతే.. వాటికి ముందుగా రెడ్ నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే, మాల్స్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని ఏ ఒక్క మాల్ కూడా సరిగా ఆస్తి పన్ను చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. అందరి నుంచి పన్నులు వసూలు చేయడమే ఈ డ్రైవ్ లక్ష్యం. ఈ డ్రైవ్ పూర్తయిన తర్వాత, నగరంలోని స్టార్ హోటల్స్‌ను కూడా ఇదే విధంగా తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.