SDN Buzz - Global Telugu News, World Updates, Political Buzz | SDN News
Submit Article

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Telangana

Published on 15 Oct 2025

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ప్రభాకర్ రావు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం (అక్టోబర్ 14న) ఆదేశించింది. ఈ మేరకు ప్రభాకర్ రావు తన యాపిల్‌ ఐ క్లౌడ్‌ పాస్ వర్డ్ రీసెట్ చేయాలని, ఆ సమాచారాన్ని.. దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని జస్టిస్‌ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో ఆ సమాచారాన్ని తీసుకోవాలని సిట్‌కు సుప్రీం సూచించింది. అయితే క్లౌడ్‌లోని సమాచారం డిలీట్ చేయడానికి ప్రయత్నించినట్లు తేలితే.. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది.
ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మధ్యంతర అప్లికేషన్ (interlocutory application) దాఖలు చేసింది. ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
వాదనల సందర్భంగా దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని కోర్టుకు నివేదించారు మెహతా. ప్రభాకర్ రావు గురించి కొన్ని విషయాలు చెబితే కోర్టు కుడా షాక్‌కు గురవుతుందని తెలిపారు. ఈ మేరకు వివరాలు కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు తన ఐ క్లౌడ్‌లోని ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారని.. కోర్టు ప్రొటెక్టివ్ ఆర్డర్ ఉన్నా ఇలా చేశాడని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. అయితే సిట్‌ విచారణలో గతంలో ప్రభాకర్‌రావు సంచలన విషయాలు అంగికీరించిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిదింతుడిగా ఉన్న ప్రభాకర్ రావు తరఫున సీనియర్ అడ్వొకేట్ దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేశారు. ప్రభాకర్ రావు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయన్ను 11 సార్లు విచారణకు పిలిచారని, 18 గంటలు విచారించారని తెలిపారు. అదంతా వీడియో రికార్డింగ్ అయిందని పేర్కొన్నారు. ఆ వీడియో చూస్తే.. ఆయన దర్యాప్తునకు సహకరించారో లేదో తేలిపోతుందని వాదించారు. ఇక, తన పాత ఐ క్లౌడ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ప్రభాకర్ రావు మరిచిపోయారని కోర్టుకు తెలిపారు శేషాద్రి నాయుడు. అయితే ప్రభాకర్ రావు పాస్‌వర్డ్ చెప్పిన తర్వాత.. ఐ క్లౌడ్ సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటే.. ఈ కేసులో డొంక కదిలే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 2023 ఎన్నికల సమయంలో ఒక్క రోజే 600 మంది ఫోన్లు ట్యాప్, ‌ఈ లిస్ట్‌లో కాంగ్రెస్ కీలక నేతలు ఉన్నారని అప్పట్లో వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.